ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు, విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షపదవి స్వీకరించాలని కోరుతూ సీఎల్పీ పక్షాన లేఖ రాస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భగా రాష్ట్రవ్యాప్తంగా పేదలకు, కరోనా బాధితులకు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిందని చెప్పారు. అదే విధంగా ఎన్.ఎస్.యూ.ఐ, యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాలు ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయని భట్టి చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చేలా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించందని తెలిపారు.
ప్రజలు సుభిక్షంగా జీవించేందుకు అవసరమైన అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు రూపొందించాయని గుర్తు చేశారు. అందులో భాగంగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వం రంగ సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు.. సహా ఎన్నింటినో నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిందని భట్టి పేర్కొన్నారు.
కరోనా ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాన లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. లాక్ డౌన్ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లక్షలమంది వలస కూలీలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కొన్ని నెలలుగా దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, వ్యవసాయ రంగం కుప్పకూలే పరిస్థితులు దాపురించాయని అన్నారు. మొత్తం దేశ భవిష్యత్తే అంధకారంగా మారుతోందన్నారు.
ప్రస్తు పరిస్థితుల్లో దేశ నిర్మాణానికి సంబంధించి నేర్పు విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ బాధ్యతలు మళ్లీ స్వీకరించాలని భట్టి చెప్పారు. రాజీవ్ గాంధీ హయాంలో దేశాన్ని ప్రపంచంలో మూడో శక్తిగా తీర్చిదిద్దారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపించారు. అమెరికా, రష్టాలతో సమానంగా దేశాన్ని నడిపించారని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా, శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ ఛైర్ పర్సన్ గా దేశంలో ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలను తీసుకువచ్చామని భటి చెప్పారు.