హైదరాబాద్: లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం భారీ ఎత్తున పక్కదారి పడుతుండటంతో చౌక ధరల దుకాణాలపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పెద్దసంఖ్యలో బినామీ డీలర్లు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో డీలర్‌షిప్‌ల ప్రక్షాళనకు చర్యలు మొదలుపెట్టింది. రేషన్ ‘లాగిన్’ను కుటుంబ సభ్యులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 17వేల మందికిపైగా రేషన్ డీలర్లు ఉన్నారు. ఇందులో పలువురు తమ రేషన్ దుకాణాల్ని అనధికారికంగా ఇతరులకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం వెనుక పెద్దమొత్తంలో చేతులు మారినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు.. రెండున్నర నెలల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న 7,629 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. బాధ్యులపై కేసులు పెడుతూనే ప్రక్షాళనకు పౌరసరఫరాల శాఖ ఉపక్రమించింది.
లోగుట్టు అందులోనే…
రేషన్ దుకాణాలకు వచ్చే లబ్ధిదారులకు బియ్యం, చక్కెర వంటి సరకులు ఇవ్వాలంటే ఈ-పాస్ మిషన్‌లో డీలర్ తన వేలిముద్ర ద్వారా లాగిన్ కావాలి. అనారోగ్యం, ఇతర సందర్భాల్లో పౌరసరఫరాల శాఖ ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. డీలర్ ప్రతిపాదించిన మరో ముగ్గురికి రేషన్ ‘లాగిన్’ ఇచ్చింది. తమ బంధువుల పేరుతో కొందరు బినామీల్ని రంగంలోకి దించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాల్లో బినామీ డీలర్లు గణనీయ సంఖ్యలో ఉన్నట్లు కొద్ది వారాల క్రితం పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించిన ఈ శాఖ రేషన్ ‘లాగిన్’కు సంబంధించి నిబంధనల్ని మార్చింది. ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. గతంలో ఒక రేషన్ దుకాణానికి డీలర్‌తో కలిపి మొత్తం నాలుగు ‘లాగిన్’లు ఇవ్వగా ఇప్పుడు మూడుకు కుదించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. డీలర్‌తో పాటు లాగిన్ ఇచ్చే మరో ఇద్దరు రక్త సంబంధీకులై ఉండాలి. భార్యా లేదా భర్త, పిల్లలకే అవకాశం. సోదరులు, అక్కాచెల్లెళ్లకు ఇవ్వరు. డీలర్‌కు పెళ్లి కాకపోతే అతనితో పాటు తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది.