హైదరాబాద్, ఆంధ్రప్రభ : మెట్రో రైళ్లను ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ అభినవ్ అనే ప్రయాణికులు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు కోసం ప్రయాణికులు స్టేషన్లకు చేరుకుంటున్నారని కానీ మెట్రో 7 గంటలకు ప్రారంభం కానుండడంతో సుమారు గంట పాటు వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు వేచి చూసే వీడియోను మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
ఉదయం సమయంలో క్యాబ్‌ల రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని దీనిని పరిశీలించాలని అభినవ్ ట్విట్టర్లో కోరాడు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. నగరంలో మెట్రో రైళ్లు ప్రస్తుతం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్నాయి. చివరి రైలు రాత్రి 10 గంటలకు బయలుదేరుతోంది.