ప్రభ న్యూస్, : సుమారు ఏడాదిన్నర తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిటకిటలాడుతుండటంతో ఆర్టీసీకి పూర్వవైభవం వస్తుందన్న ఆశ అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎక్కువ రద్దీ ఉన్న రూట్లను గుర్తించి ఆయా మార్గాల్లో బస్సుల ట్రిప్పులను పెంచుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల సంఖ్యను కూడాపెంచాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల అభీష్టానికి అనుగుణంగా ఆర్టీసీ అడుగులు పడుతుండడం, ఆ దిశగా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకుంటుండడంతో ఫిర్యాదుల విభాగాన్ని సైతం ప్రారంభించారు. ప్రయాణికుల కోరిక మేరకు శివారు ప్రాంతాలకు బస్సులను నడిపించాలని, ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన వాటిని పరిశీలించి అవకాశమున్న రూట్లలో బస్సుల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థుల కోసం గ్రేటర్ ఆర్టీసీ పలు రూట్లలో 15కు పైగా ఎక్స్‌క్లూజివ్ (రిక్వెస్ట్ ఆపరేషన్స్) బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఆర్డినరీ అన్ని సర్వీసుల్లో విద్యార్థుల బస్‌పాసులతో రాకపోకలు సాగించవచ్చని అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌కు ముందు 25ఎక్స్ క్లూజివ్ బస్సులను నిర్వహించారు. కళాశాలల యాజమాన్యాలు ఆర్టీసీకి ఎక్స్‌క్లూజివ్ బస్సుల కోసం రిక్వెస్ట్ లెటర్స్ పెడితే ఆయా రూట్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులను నిర్వహిస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
ఉప్ప ల్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, గండిమై సమ్మ, పటాన్‌చెరువు, ఎస్‌ఆర్ నగర్, కీసర ప్రాంతాలకు విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని, గతంలో ఉన్న రూట్లలో ఎక్కడైనా రద్దు చేసి ఉంటే ఆయా డిపో మేనేజర్ల దృష్టికి తీసుకుని వేళ్తే వాటిని పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital