Tuesday, November 26, 2024

దీర్ఘకాలిక అనారోగ్యం : మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్య

కొండపాక: సుదీర్ఘ కాలంగా అనారోగ్య సమస్యలతో వేగలేక మహిళ మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సిద్దిపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుద్దెడ గ్రామ పంచాయతీలో గురువారం చోటు చేసుకుంది. సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్న ఈశ్వరోజు లావణ్య (40) అనే మహిళ బిసి కాలని లోని సొంత ఇంట్లో ఎవరూలేని సమయంలో మధ్యాహ్నం 12.00 గంటల ప్రాంతంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్త భాగ్యమ్మ కరివేపాకు కోసము పక్క ఇంటికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి వెళ్లిన లావణ్య ఈ ఘాతుకానికి పాల్పడింది.

హఠాన్మరణానికి దిగ్భ్రాంతికి గురైన అత్త భాగ్యమ్మ, మృతురాలి కుమారుడు నాగరాజుకు సమాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా అప్పటికే ఇంటి పై కప్పు కు ఉన్న కొక్కానికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. బోరున విలపించిన నాగరాజు స్థానిలకు, బంధుమిత్రులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి భౌతికకాయాన్ని తరలించారు. గత ఆరు సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యంతో భర్త బాలాచారి అకాల మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన లావణ్య ఆనారోగ్యానికి చికిత్స నిమిత్తం సుమారు మూడు లక్షల రూపాయలు అప్పు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యం ఒకపక్క, అప్పుల బాధ మరోపక్క వేధిస్తుండడంతో కలత చెందిన ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement