- చారిత్రాత్మకమైన మెదక్ చర్చి తెలంగాణకు గర్వకారణం
- క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఏకైక సీఎం కేసీఆర్
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న మెదక్ సీఎస్ఐ చర్చిని సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న హరీష్ రావును మత గురువులు ఆశీర్వదించారు.
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. వందేళ్లుగా ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతోందన్నారు. కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా ప్రఖ్యాతి గాంచినట్లు తెలిపారు. చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్లేస్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారని, 1924 డిసెంబర్ 25న నిర్మాణం పూర్తయ్యిందన్నారు. చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాస్నెట్ మనుమడు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 1914లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఉండేదని, ప్రజలు ఆకలితో అలమటించేవారని, ఈ సమయంలో చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కరువుతో అల్లాడుతున్న ప్రజలను చూసి చలించాడని గుర్తుచేశారు. ఉచితంగా కాకుండా ప్రజలకు పని చూపి, వారి ఆకలి తీర్చాలని సంకల్పించాడని తెలిపారు.
ఏసుక్రీస్తు మందిరం నిర్మాణం చేపట్టి ప్రజల ఆకలిని తీర్చాడని తెలిపారు. చారిత్రకమైన చర్చి మెదక్ జిల్లాలో ఉండటం యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిందన్నారు. గత తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు కేసీఆర్ ఏం చేసారు, ఎంత బాగా చూసుకున్నారనే విషయం అందరికి తెలుసన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టమస్ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి, ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. క్రిస్మస్ డే మరుసటి రోజు జరుపుకునే బాక్సింగ్ డేను సెలవుగా ప్రకటించారని తెలిపారు.
డిసెంబర్ 25తో పాటు, 26న ఘనంగా పండుగ జరుపుకునేలా రెండు రోజులు సెలవు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి క్రిస్టమస్ పండుగకు పేద క్రిస్టియన్లకు గిఫ్టు ఇచ్చినట్లు గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇలా అన్ని మతాలను సమానంగా గౌరవించి, సంతోషంగా జీవించేలా చూసిండని తెలిపారు. అన్నివర్గాలు బాగున్నాయి.. కాబట్టే హైదరాబాద్, తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వం అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నదని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రజలందరికి సుఖశాంతులు కలగాలని ఆ యేసును ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాంకాంక్షలు తెలియజేయజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, నియోజకవర్గ ఇంచార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి, పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, కౌన్సిలర్ జయరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.