రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నా రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ ప్రజావాణి కార్యాలయంలో ప్లానింగ్ బోర్డ్ ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రత్యేక్షంగా పర్యవేక్షించటానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డిని నియమించింది.
తమ సమస్యలను ప్రజావాణిలో చెప్పేందుకే సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు అవకాశం కల్పించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ప్రజావాణి ఇన్ఛార్జ్గా తనపై సీఎం గురుతర బాధ్యత ఉంచారన్నారు. ఇప్పటి వరకు 4.90లక్షల అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిలో నాలుగు లక్షలు సమస్యలను పరిష్కరించే దిశగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు పూర్తి కాకముందే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని.. లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే మిగిలిన హామీలనూ అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పనితీరుపై చిన్నారెడ్డి విమర్శలు చేశారు.
”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన నిరుద్యోగ యువతను కేసీఆర్ పట్టించుకోలేదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. గొర్రెలు, ఆవుల పంపిణీ కార్యక్రమాల్లో సైతం భారాస నాయకులు తమ చేతివాటం ప్రదర్శించారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కడంలేదు. గతంలో ప్రతిపాదించి ఆచరణకు నోచుకోని ప్రాజెక్టులను మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. భారాస నేతలు ఏ ముఖం పెట్టుకుని కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్నారు?గతంలో జరిగిన పనులకు సంబంధించి సుమారు రూ.40 వేల కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా తయారు చేశారు. రూ.లక్ష బిల్లు చెల్లించాలంటే ఆలోచించే పరిస్థితి తలెత్తింది. ఉద్యోగ నియామకాల విషయంలోనూ భారాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తాం” అని చిన్నారెడ్డి తెలిపారు.