ఖమ్మం : గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత కేసీఅర్ దే అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని గిరిజన దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండా గ్రామం, దొనబండ గ్రామం, మంగ్య తండా గ్రామం, KV బంజర గ్రామం, మూలగూడెం గ్రామం, NV బంజర గ్రామం, రజబల్లి నగర్ గ్రామం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.1.40 కోట్ల విలువైన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.ఆయా గ్రామాల్లో గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలతో మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు.రఘునాథపాలెం మండలంలో 17గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని 37 గ్రామాలకు పెంచుకున్నామని, వాటిలో 20 తండాలను కొత్త గ్రామాలుగా మార్చి స్వయం పాలనా చేసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాలలో రూ. 20 లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాలు అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు.. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, హైద్రాబాద్ లో బంజారా లకు ఆత్మగౌరవం కల్పించే విధంగా ప్రభుత్వం బంజారా భవన్ నిర్మిస్తున్నదని, గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు.