Tuesday, November 26, 2024

చెన్నూరు లిప్ట్‌.. కేసీఆర్‌ గిప్ట్, రైతుల సంబరాలు..

చెన్నూరు నియోజకవర్గ రైతన్నల చిరకాల వాంఛ నెరవేరుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో చెన్నూరు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సాగునీరు అందించే చెన్నూర్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని అసెంబ్లీలో మంత్రి హరీష్‌ రావు ప్రకటించడంతో రైతుల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన కల నెరవేరనున్న శుభ సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పిలుపు మేరకు చెన్నూరు పట్టణంలో రైతులు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్‌, మందమర్రి, మండలాలు క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూర్‌ మున్సిపాలిటీలలో పార్టీ శ్రేణులతోపాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం చెన్నూరు లిఫ్ట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈసందర్భంగా రైతులు, నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే రైతాంగానికి రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, ఉచిత విద్యుత్‌ వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. తాజాగా చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా తమ బీళ్లకు నిరంతరాయంగా సాగునీరందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామని నియోజకవర్గ రైతులు ముక్తకంఠంతో తెలిపారు. చెన్నూర్‌ ఎత్తిపోతల పథకానికి ఎంతో కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏఎంసీ, పీఎంసీ పాలకవర్గాలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మున్సిపల్‌ పాలకవర్గాలు, రైతులు, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement