హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర్రంలోని రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు చెక్ పెట్టే దిశగా ఆర్వోబీల నిర్మాణం వేగంగా సాగుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆర్వోబీల పనులు పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి కూడా వాహనదారులకు ఉపశమనం కలుగనుంది. రాష్ట్రంలోని పలు చోట్ల రైల్వే క్రాసింగ్‌ల వద్ద పట్టాలు దాటే క్రమంలో ప్రతీ ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. కొన్ని చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, మరికొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లను తెలిపే సూచీబోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం ఈ పరిస్థితికి కారణం. దీంతో రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా రూ.2,528 కోట్ల అంచనా వ్యయంతో 53 కొత్త ఆర్వోబీల నిర్మాణం చేపట్టింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల మానవ రహిత రైల్వే క్రాసింగ్‌లు ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలుచోట్ల గేట్లు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో రెండు వైపులా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో గేట్ల వద్ద వాహనదారులకు గంటల తరబడి సమయం వృధా అవుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలో ఎక్కడా మానవ రహిత రైల్వే క్రాసింగ్‌లు లేకుండా చూడాలనీ, ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్న క్రాసింగ్‌ల వద్ద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బి శాఖ అధికారులను ఆదేశించారు.
దీంతో ఆర్అండ్బి అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రధాన ప్రాంతాలు, పట్టణాలలో 53 రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీల నిర్మాణం చేపట్టారు. దీంతో ఇప్పటికే 28 ఆర్వోబీల నిర్మాణం పూర్తి కాగా ప్రస్తుతం 25 ఆర్వోబీల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల జిల్లా రవీంద్ర ఖని, బెల్లంపల్లి-మందమర్రి, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ మార్కెట్ యార్డు, హన్మకొండ జిల్లాలోని ఉప్పల్, లింక్‌రోడ్డు, కాజీపేట రెండో ఆర్వోబీ, మున్సిపల్ ఫిల్టర్ బెడ్, హన్మకొండ దర్గా, కేఎంటీ పార్క్, డోర్నకల్, ఘట్కేసర్, రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి, వికారాబాద్ జిల్లా తాండూర్ టౌన్, నిజామాబాద్ జిల్లా మాధవనగర్, నిజామాబాద్ బైపాస్, జహీరాబాద్, సిద్దిపేట, కొత్త బ్రాడ్‌గేజ్ లైన్, భద్రాచలం కొత్త బ్రాడ్‌గేజ్ లైన్, ఇల్లందు తదితర ప్రాంతాలలో ఆర్వోబీల నిర్మాణం పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని రోడ్లు, భవనాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇవి పూర్తయితే రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి మోక్షం కలిగినట్లవుతుంది