ప్రభన్యూస్ : ప్రతి ఏడాది వర్షాకాలంలో ఉత్పన్నమయ్యే మురుగునీటి సమస్యకు ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏటా మురుగునీరు రోడ్లపై ఉప్పొంగటం గ్రేటర్ హైదరాబాద్‌లో పరిపాటిగా సాగుతోంది. దాంతో మురుగునీటి కాల్వలను శుభ్రపరిచేందుకు నూతన సాంకేతికతతో రోబోటిక్ వ్యవస్థను తీసుకురావటానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ పనితీరు, నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ)కి అప్పగించారు. దాంతో మురుగు వ్యవస్థ నిర్వహణలో భాగంగా ఇప్పటికే ప్రతిపాదించబడిన రూ.35 కోట్లతో పాటు అదనంగా 66ఎయిర్‌టెక్ యంత్రాలు కొనుగోలు చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం జర్మనీ నుంచి ప్రత్యేక సేఫ్టీసూట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
మురుగునీటి నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త విధానాన్ని అధికారులు అనుసరిస్తున్నారు. దీని ఫలితంగా వాటర్ బోర్డు మురుగునీటి నిర్వహణ పనుల కోసం సోషల్ ఆడిట్ నిర్వహించి నగరంలో 792 హాని కలిగించే ప్రదేశాలను గుర్తించింది. ఆ ప్రదేశాల్లో మురుగునీటి నిర్వహణ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సాంకేతిక బృందాలను రంగంలోకి దింపింది. మురుగునీటి వ్యవస్థ బాగుచేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిన రూ.35 కోట్లు కాకుండా అదనపు వ్యయానికి సిద్ధమయ్యారు. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న సన్న పైపులైన్ల స్థానంలో వెడల్పు అయిన పైపులను ఏర్పాటు చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital