హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సిపి గజరాజ్ భూపాల్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహ్మద్ సనా ఉల్లా, అకాశ్‌పూర్ వీర చైతన్య, పాలెం అశోక్ కుమార్ రెడ్డి , గోధి వీర అర్జున్ రావు , కోల్‌కొండి రఘువీర్, తిరుమల అనిల్ కుమార్ , తదితరులను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులు నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి వద్ద నుంచి దాదాపు 15.30 లక్షలు వసూలు చేశారని తెలిపారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో ఓ ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని అదే కార్యాలయం చిరునామాతో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. ట్యాక్స్ అసిస్టెంట్, ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలకు రూ. 3 నుంచి 4 లక్షల వసూలు చేసి సదరు నిరుద్యోగులకు ఫేక్ అపాయింట్ లెటర్లు కూడా ఇచ్చారన్నారు. అయితే తమకు ఇచ్చినవి ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లని తెలుసుకున్న సదరు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించడంతో వారి గట్టు బయటపడిందన్నారు.