హైదరాబాద్ – సిఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు అన్నట్లు ఉందని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ ను తెలంగాణ భవన్ లో నేడు ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజాదర్భార్ మొదటి రోజు ఐదు నిమిషాలకు పరిమితం అయింది. రేవంత్ అడుగులు కూల్చివేతలతో ప్రారంభం అయ్యాయని అన్నారు. ఆరు గ్యారెంటీలకు అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిస్తేజం అలముకుంది. కేసీఆర్ మార్క్ పాలన దేశానికి దిక్సూచి అయింది.. రేవంత్ మార్క్ పాలన దేశానికి నవ్వుల పాలు అయిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? రేవంత్ ఏడాది పాలనలో రాష్ట్రంలో రోడ్డెక్కని వర్గం లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైంది. హైదరాబాద్ నగరంలో సంవత్సరానికి ముగ్గురు పోలీస్ కమిషనర్ లు , ట్రాన్స్ కో సీఎండీలు నలుగురు మారారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.
ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరదలు వస్తే సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఒక మంత్రి దేవుడిపై భారం వేశాడు. నిత్యం హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్న మంత్రులు వరదలు వస్తే ఒక్క హెలికాప్టర్ ను ఖమ్మం పంపించలేకపోయారు. వరద బాధితులను పరామర్శించేందుకు మేము వెళ్తే మాపై దాడి చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. రాజకీయ కక్షసాధింపులు ఎక్కువయ్యాయి. ఎన్నడూలేని విధంగా మతకలహాలు జరుగుతున్నాయి. చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయింది. శాంతిభద్రతల పరిరక్షణలో హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని హరీశ్ రావు విమర్శించారు.
రేవంత్ రెడ్డి పాలనలో సంక్షేమం బంద్ అయింది. ఏడాదిలో ఒక్క ఇల్లు అయినా రేవంత్ రెడ్డి కట్టారా అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. విద్యా భరోసా పేరుతో ప్రతి విద్యార్థికి ఐదు లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి .. ఇప్పటికీ ఊసు లేదు. ఇందిరమ్మ రాజ్యంలో నాలుగు వేల ఫించన్ ఎక్కడికి వెళ్లిందో సీఎం చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి బస్సుల సంఖ్యను తగ్గించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 4 లక్షల 26 వేల కోట్లు మాత్రమే అప్పులు అయ్యాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేశామని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరంలోనే లక్ష కోట్లు అప్పులు చేసిందని హరీశ్ రావు అన్నారు.