హైదరాబాద్, ఆంధ్రప్రభ : గ్రూప్-1 ప్రశ్నపత్రాల సెట్ల రూపకల్పనలో ఈ సారి టీఎస్‌పీఎస్‌సీ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఏ, బీ, సీ, డీ అక్షరాలతో ప్రశ్నపత్రాల సెట్లను సిద్ధం చేస్తారు. అయితే ఈసారి దీనికి బిన్నంగా నంబర్లతో కూడిన సెట్లను పరీక్షల్లో ఇవ్వనున్నట్లు కమిషన్ తెలిపింది. గతంలో ఏ, బీ, సీ, డీ అక్షరాలతో సెట్ ప్రశ్నపత్రాలు వస్తే ఆ ఒక్క అక్షరాన్ని నింపి బోల్డ్ చేసేవారు. కానీ ఈసారి ఆరు అంకెలతో కూడిన నంబర్లు ఇస్తారు. వాటినే రాసి గుడ్రంగా దిద్దాలి. తద్వారా పరీక్ష కేంద్రంలో ఏ అభ్యర్థికి ఏ సెట్ ప్రశ్న పత్రం వచ్చిందనే విషయాన్ని అచనా వేయడం కష్టమవుతుంది. దాంతో అక్రమాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షను ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 16వ తేదీన జరగనున్న విషయం విధితమే. ఆదివారం నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.
ఈ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ సదుపాయం ఆదివారం నుంచి పరీక్ష జరిగే తేదీ 16 వరకు అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. ఆఖరి సమయంలో రద్దీకి అవకాశం ఇవ్వకుండా అభ్యర్థులు హాల్‌టికెట్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ పైన, వెబ్‌సైట్‌లో ఉన్న సూచనలను మార్గదర్శకాలను పాటించాలని కోరంది. ఈనెల 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాల్లో పరీక్ష జరగనుంది. ఈనేపథ్యంలో పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. 1041 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో హాల్‌ల్లో 24 మంది నుంచి 48 మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో మెయిన్ పరీక్షను నిర్వహించనున్నారు.