జోగిపేట, మే13(ప్రభన్యూస్): మారుతున్న రాజకీయ పరిణామాల్లో ప్రజల్లో వస్తున్న చైతన్యంతో దేశంలో మార్పు రాబోతుందని, పదేళ్ల తర్వాత అధికారంలోకి ఇండియా కూటమి ఏర్పాటు కాబోతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం జోగిపేట మున్సిపల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన 196 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ విశ్వాసం నమ్మకం తనకు ఉందని, జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించబోతుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 12 నుంచి 14 ఎంపి స్థానాలు రాబోతున్నట్లు మంత్రి తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ కు మంచి మెజార్టీ వస్తుందని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అత్యధిక మెజార్టీ రాబోతుందన్నారు.
మంత్రి దామోదర్ తో పాటు ఆయన కూతురు త్రిష కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, సీనియర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, ఆకుల చిట్టిబాబు, డాకూరి శివశంకర్, కోరబోయిన నాగరాజు, దుర్గేష్, చందర్ నాయక్, పార్టీ నాయకులు పట్టోళ్ల ప్రవీణ్, గుర్రం కృష్ణ, సత్యం, మధు తదితరులు ఉన్నారు.