హైదరాబాద్ : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కన్నీటి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రామోజీరావు మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తెలిపారు. రామోజీరావు మరణం చాలా బాధాకరమన్నారు. సమాజహితం కోసం ఆయన అహర్నిశలు పాటు పడ్డారని తెలిపారు. రామోజీరావు ఒక వ్యక్తికాదని, వ్యవస్థ అని కొనియాడారు.
సినీ ఇండస్ట్రీకి రామోజీరావు ఎనలేని కృషి చేశారని, ధర్మం కోసమే పని చేస్తానని చాలా సందర్భాల్లో తనకు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉండిపోతాయని తెలిపారు. ఎన్నో ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారని చంద్రబాబు చెప్పారు. తన జీవితకాలంలో రామోజీరావు విశ్వసనీయత సంపాదించుకున్నారని, తెలుగు జాతికి ముందుకు తీసుకెళ్లేందుకు చాలా కృషి చేశారని తెలిపారు. ఏపీ అభివృద్ధి విషయంలో రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
రామోజీరావు కుటుంబసభ్యులను ఓదార్చిన చంద్రబాబు….
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్థీవదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉంచారు. రామోజీరావు మరణ వార్త విన్న చంద్రబాబు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రామోజీరావు పార్థీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. రామోజీరావు మరణం చాలా బాధాకరమని చంద్రబాబు తెలిపారు.