కాంగ్రెస్ పాలనలో ఉన్న వస్త్రం కూడా పోయింది
ఆబద్దాలతోనే ఆ పార్టీ మోసం చేస్తోంది
కెసిఆర్ సంక్షేమ పథకాలకు రేవంత్ మంగళం
రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా కృష్ణార్పణం
సిద్దిపేట ఎన్నికల ప్రచారం సభలో హరీశ్ రావు
కాంగ్రెస్ పాలనలో అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్లు అయిందన్నారు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.. . చెక్‌బౌన్స్ అయితే శిక్ష పడుతుందని అంటూ కాంగ్రెస్ బాండు పేపర్లు బౌన్స్ అయ్యాయని, . అందుకు కాంగ్రెస్‌కు శిక్ష పడాల్సిందేనని అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కంపేటలో కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, ఇవి తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని అన్నారు.
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల ఆటలు సాగకూడదంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటే అమలుచేసి ఐదు అమలు చేశామని అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘సీఎం రేవంత్ ఇప్పుడు సిగ్గులేకుండా దేవుడిపై ఒట్టు పెట్టి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరల కొండెక్కాయి. మంచినీళ్లు వస్తలేవు, పింఛన్లు వస్తలేవు. కేసీఆర్ తెచ్చినవన్నీ తీసేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ గోవిందా గోవిందా పాటలా మారాయి. దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పింఛను అన్నీ గోవిందా. మహాలక్ష్మి గ్యారంటీ మహా మోసం. ఈ ఎన్నికల్లో వినోదన్నను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేస్తాం. ఆయన అభివృద్ధి సాధకుడు. గత ఐదేండ్లలో కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశాడు?, బీజేపీ పదేండ్ల పాలనలో ఉప్పు, పప్పు ధరలు పెరిగాయి.
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. సాగునీళ్లు, మెడికల్ కాలేజీలు, నిరంతర కరెంటు, కేసీఆర్ కిట్టు.. ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ పాలనలో అమలయ్యాయి. కాంగ్రెస్ అడ్డుకున్నా పట్టుబట్టి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. హస్తం పార్టీ వచ్చాక అంతా రివర్స్ అయింది. కరెంటు మీటర్లు కాలిపోతున్నయ్, రిపేరుకు రూ.10 వేలు ఖర్చవుతోంది. గిరిజనులకు కేసీఆర్ పోడు పట్టాలిచ్చుండు. రేవంత్ చేసిందేమీ లేదు. గుంపు మేస్త్రీకి మాటలెక్కువ.. చేతలు తక్కువ. గుంపు మేస్త్రీ గూబ పలగాలంటే కారు గుర్తుకు నొక్కాలి. ఎవరు మనకు మేలు చేశారో వాళ్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ముసలోళ్లు కేసీఆర్ ఇచ్చిన కంటివెలుగు కళ్లద్దాలు పెట్టుకుని మూడో నంబరు బటన్ నొక్కాలి.’ అని హరీశ్ రావు అన్నారు.