Friday, November 22, 2024

ఛలో అసెంబ్లీ.. సిద్ధమవుతున్న ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ వైద్యులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు, సీనియారిటీ మేరకు విభాగాధిపతుల నియామకం తదితర విషయాల్లో తమకు జరుగుతున్న అన్యాయంపై ఎస్సీ, ఎస్టీ వైద్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 5వేల మంది ఎస్సీఎస్టీ వైద్యులంతా కలిసి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా వైద్య, ఆరోగ్యశాఖలోని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ (డీహెచ్‌), డీఎంఈ, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఇన్‌చార్జి పోస్టుల విషయంలో తెలంగాణ ఎస్సీఎస్టీ వైద్యుల అసోసియేషన్‌ తీవ్ర అసతృప్తితో ఉంది. డీహెచ్‌, డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ పోస్టులకు సీనియారిటీ లిస్టులో ఎస్సీ ఎస్టీ వైద్యులే ఉన్నా… జూనియర్లను ఆయా పోస్టుల్లో ఇన్‌చార్జిల పేరుతో నియమించటాన్ని తప్పుబడుతున్నారు.

సీనియారిటీ లిస్టులో ముందున్న వారిని కాదని 154 స్థానంలో ఉన్న అధికారిని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌గా కొనసాగిస్తుండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైద్య,విద్యా విభాగంలో అడిషనల్‌ డైరెక్టర్‌ పదోన్నతులు పూర్తయిన తర్వాత కూడా 11 స్థానంలో ఉన్న అధికారిని డీఎంఈగా కొనసాగిస్తుండడాన్ని తప్పుబడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ పదవిలోనూ జూనియర్‌ అయిన డీఎంఈ రమేష్‌రెడ్డినే కూర్చోబెట్టటంపై మండిపడుతున్నారు. ఇటీవల టీవీవీపీ కమిషనర్‌ పోస్టు కోసం దళితవర్గానికి చెందిన ఓ సీనియర్‌ వైద్యుడు దరఖాస్తు చేసుకోగా ఆయనకు జాయిండ్‌ కమిషనర్‌ పోస్టును కట్టబెట్టటంతో ఎస్సీఎస్టీ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను అవమానించటమేనని విమర్శిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో సీనియర్‌ ఎస్సీఎస్టీ వైద్యులకు జరుగుతున్న అన్యాయంపై తగిన చర్యలు తీసుకుని, న్యాయం చేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సాక్షాత్తూ సీఎం కేసీఆరే ప్రకటించిన విషయాన్ని బడ్జెట్‌ సమావేశాల జరుగనున్న నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో వైద్య, ఆరోగ్యశాఖలో డీహెచ్‌, డీఎంఈ పదవుల్లో జూనియర్లను కూర్చోబెట్టటంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే తరహాలో రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోనూ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ప్రశ్నించనున్నారని ఎస్సీఎస్టీ వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే భట్టి విక్రమార్క ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నను చేర్చినట్లు వివరించారు.

ఛలో అసెంబ్లితో పాటు ట్యాంక్‌ బండ్‌పైనున్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా, అధికారపార్టీతోపాటు పలు పార్టీల నేతలను కలిసి వినతిపత్రాలు సమర్పించటం ఇలా పలు రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎస్సీఎస్టీ వైద్యుల అసోసియేషన్‌ సిద్ధమవుతోంది. ట్యాంక్‌బండ్‌పై ధర్నా కోసం పోలీసుల నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 154వ జీవో మేరకు వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు కల్పించటంతోపాటు విభాగాధిపతులను సీనియారిటీ మేరకు నియమించాలని ఎస్సీఎస్టీ వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement