Monday, November 25, 2024

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్.. అదో పెద్ద గ్యాంగ్ అట‌..

ప్రభన్యూస్‌ : మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పలు పోలీస్టేషన్ల పరిధిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డ 8మంది ముఠా సభ్యులను మహబూబాబాద్‌ జిల్లా సిసిఎస్‌ పోలీసులు.. తొర్రూరు పాలకేంద్రం వద్ద 4 బైక్‌లతో సహా 8 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన స్నాచర్ 8 మంది మరిపెడకు చెందిన వారు కావడం విశేషం. మరిపెడకు చెందిన బంటు జయరాజు (సీతారాం పురం), పిల్లూరి అనిల్‌(సేవానగర్‌), బానోత్‌ రాజేష్‌ (గాలివారిగూడెం), పిల్లురి లయవర్ధన్‌ (సేవానగర్‌), చించు సాయికిరణ్‌ (రాంవిలాస్‌ సందు), బంక్క ప్రమోద్‌ కుమార్‌ (రాంవిలాస్‌ సందు), బంటు వినయ్‌రాజు (సీతారాంపురం), మరిపెల్లి శ్రీనివాస్‌ (మరిపెడ) 8మంది ముఠాగా ఏర్పడి గత 2 సంవత్సరాలుగా మహబూబాబాద్‌, సూర్యాటపేట, ఖమ్మం జిల్లాలో వివిధ పోలీస్టేషన్ల పరిధిలో 13 చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.

వృద్ద మహిళలు, ఒంటరి మహిళలు టార్గెట్‌గా చేసుకుని వారి ఇంటికి వెళ్లి మెడికల్‌ విభాగం నుంచి వచ్చాం అంటూ.. కరోనా టీకాల గురించి అడుగుతూ వారి వివరాలు తెలుసుకుని ఎవరెవరు ఉంటారో తెలుసుకుని మరుసటి రోజు వచ్చి కరోనా గురించి మాట్లాడుతూ మహిళ మెడలోని బంగారు గొలుసులను తెంపుకుని పోయేవారు. ఇలా నేరం చేసినప్పుడల్లా ఇద్దరిద్దరు బ్యాచ్‌లుగా విడిపోయి ఇద్దరు నేరం చేస్తే మిగతావారు కాపలా ఉండేవారు. ప్రతి సారి బైక్‌లను మార్చుతూ మనుషులను మార్చుతూ నేరం చేసేవారు. ఇలా 4 ద్విచక్ర వాహనాలు ఉపయోగించుకుని బైక్‌లకు నెంబర్‌ ప్లేట్స్‌ తీసేసేవారు. ఈ నేరాలన్నింటికీ సూత్రధారుడు, ముఖ్యమైన నాయకుడు జయరాజు అని ఎస్‌పి తెలిపారు.

తల్లితండ్రులు 10ఏళ్ళ క్రితం చనిపోవడంతో బ్రతికి ఉన్నప్పుడు తల్లికి వచ్చే ప్రభుత్వ పింఛన్‌తో జీవించేవాడు. తర్వాత తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో మరిపెడ పట్టణంలో చుట్టుప్రక్కల వాళ్ళకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ వచ్చే వడ్డీలతో బ్రతికేవాడు. అధికవడ్డీలు భరించలేనివారు ఇతనిపై తిరగబడి అసలు, వడ్డీ ఎగ్గొట్టడం జరిగేది. ఈ క్రమంలో జీవనాధారం కష్టమై చెడు అలవాట్లకు బానిసై చుట్టుప్రక్కల యువకులకు డబ్బు ఆశ చూపి తనవైపు తిప్పుకుని విలాసాలకు పాల్పడేవాడు. ఇతనికి ఉపయోగపడ్డ 7గురు వ్యక్తులు కూడా మరిపెడకు చెందినవారే. వారు సరిగా చదువుకోలేక మధ్యలోనే చదువు ఆపి చెడు అలవాట్లకు బానిసలయ్యారు. ఇలా చెడువ్యసనాలకు బానిసలై డబ్బు దొరకక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని జయరాజుతో వెళ్ళి దొంగతనాలకు పాల్పడేవారు.

ఒక్కోసారి జయరాజు లేనప్పుడు వీరిలో మరికొంతమంది నేరుగా ఆడవారి మెడలో బంగారు నగలు లాక్కుని పోయేవారని, వీరిపై అవసరమైతే పిడి యాక్ట్‌ నమోదు చేయడమే కాకుండా ఇటువంటి నేరాలపై నిఘా పెంచడం జరుగుతుందని ఎస్‌పి కోటిరెడ్డి తెలిపారు. నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలు చాలా ఉపయోగపడ్డాయని, ప్రజలు స్వచ్ఛందంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవడానికి ముందుకు రావాలని ఎస్‌పి కోరారు. అలాగే వాహనదారులు నెంబర్‌ ప్లేట్‌ లేకుండా ప్రయాణం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. చైన్‌ స్నాచర్స్‌ నుంచి 30.25తులాల బంగారు నగలు, 4ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం సేకరించి ఈ కేసును చేధించిన సిసిఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎ.వెంకటేశ్వరావు, సిఐ కరుణాకర్‌రావు, సిబ్బందిని ఎస్‌పి అభినందించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement