చైన్.. సిస్టమ్!
పెట్టుబడి పేరుతో వసూళ్లు!
మొదలైన కొత్త రకం మోసం
రోబోకు పెట్టుబడి పెడితే అధిక ఆదాయం
పేద, మధ్య తరగతి ప్రజలే టార్గెట్
సభ్యులుగా చేర్పించడంలో నిమగ్నం
రాష్ట్రంలో మరో గొలుసుకట్టు వ్యాపారం
పోలీసు శాఖ అప్రమత్తం కావాలి
ఆదిలోనే అడ్డుకుంటే అందరికీ మేలు
ఆంధ్రప్రభ స్మార్ట్, సిరిసిల్ల: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడం ఎలా అనే దానిపై ప్రజలను మభ్య పెట్టి తమ వైపు తిప్పుకోవడంలో గొలుసు కట్టు వ్యాపార నిర్వాహకులకు వెన్నతోపెట్టిన విద్య. అయితే.. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోవడం.. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే డబ్బులు వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో పడిన వారు… తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో గొలుసు కట్టు వ్యాపారంలో భాగస్వామ్యం అవుతున్నారు. గతంలో ఇలాంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసం పోయిన వారు మళ్లీ వాటి జోలికి పోవడం లేదు. కాకపోతే కొత్తవారు సభ్యులుగా చేరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే గొలుసుకట్టు వ్యాపారంపై నిఘా వేసి ఆదిలోనే అడ్డుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం.
ఇలా మొదలవుతోంది…
కేవలం మూడు వందల రూపాయలు పెట్టుబడి పెడితే.. రెండు రోజుల తర్వాత ముప్పయి రూపాయలు ఇచ్చి తర్వాత మూడు వందల రూపాయలు తిరిగి వస్తుందనే ప్రచారంతో ఈ వ్యాపారం మొదలైంది. మీరు పెట్టే పెట్టుబడి రోబోస్‌పై తమ సంస్థ పెడుతుందని వ్యాపార ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ముప్పయి రూపాయలు రావడంతో నిజమే అని చాలా మంది నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అలాగే పక్క ఉన్న వారిని కూడా చెబుతున్నారు. ఇలా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని ఆసరగా చేసుకుని ఒక రోబోపై కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చునని ప్రచారం ముమ్మరం చేశారు.
ఇలా ఎర వేసి…
ఒక వ్యక్తి రూ. 17 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.680 లు నెల రోజులు చెల్లించడంతోపాటు చివరన పెట్టుబడిగా పెట్టిన రూ.17000 తిరిగి చెల్లిస్తామంటూ నిర్వాహకులు ఎర వేస్తున్నారు. ఇందులో అనేక ఆకర్షణీకమైన స్కీములను జనాల మీదికి రుద్దు తున్నారు. రూ.35 వేల రూపాయలు రోబో కొనుగోలు చేస్తే రోజుకు రూ.1470 చొప్పున 40 రోజులు ప్రతిరోజు ఇవ్వడంతోపాటు చివరన పెట్టిన పెట్టుబడి తిరిగి ఇస్తామంటూ చెబుతూ వస్తున్నారు. అలా రూ. 99 వేలు, ఒక లక్ష 50 వేలు, రెండు లక్షల 50 వేలు, ఐదు లక్షలు ఇలా రెండు కోట్ల వరకు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. రెండు కోట్లు పెట్టుబడి పెడితే సంవత్సరం పాటు రోజుకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడంతోపాటు చివరి రోజున పెట్టిన పెట్టుబడి వాపస్ చేస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కొత్త సభ్యుడిని చేర్పిస్తే కమీషన్
మార్కెట్ విస్తరణ కోసం సంస్థలో చేరిన సభ్యుడు కొత్తగా సభ్యుడిని చేర్పిస్తే కమిషన్ భారీగా ఎర చూపుతున్నారు. మొదట్లో ఒకరిద్దరు సంస్థల్లో చేరిన వారు లబ్ధి పొందిన తర్వాత మిగిలిన వారికి చెప్పి చేర్పించడంతో కమీషన్ డబ్బులు కూడా వస్తున్నాయి. చాప కింద నీరులా జిల్లాలో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఈ జిల్లాయే కాదు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుంది. ఈ వ్యాపారం మొదట్లో కొంతమందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రచారం మొదలు పెట్టారు. అలా మొదలైన ఈ వ్యాపారంలతో సభ్యులు భాగస్వామ్యం కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో భారీ ఎత్తున సమావేశాన్ని నిర్వహించారు. దీంతో మరికొందరు సభ్యులు చేరడానికి ఆసక్తి కనిపిస్తున్నారు.
ఆదిలో అడ్డుకోకపోతే…
మనిషి ఆశ జీవి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటే ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అయితే దీన్ని ఆసరగా చేసుకుని గొలుసు కట్టుడు వ్యాపార సంస్థలు మోసాలకు తెరతీస్తాయి. గతంలో ఎన్నో గొలుసు కట్టుడు వ్యాపారంలో నష్టపోయిన ప్రజలు ఉన్నారు. సిరిసిల్ల కేంద్రమే కాదు… రాష్ట్రమంతటా ఈ వ్యాపారం విస్తరిస్తోంది. సిరిసిల్ల కేంద్రంగా జరుగుతున్న గొలుసు కట్టుడు వ్యాపారంపై విజిలెన్స్, పోలీసు అధికారులు నిఘా వేసి, ఒకవేళ మోసాలు ఉంటే ప్రజలను అప్రమత్తం చేస్తే మోసాల బారిన పేదలు పడకుండా ఉంటారని పలువురు భావిస్తున్నారు.