Saturday, November 23, 2024

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్… అదనంగా బియ్యం సేకరణ

వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చిందని, కేంద్రం సేకరించే ధాన్యాన్ని పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం..కేంద్రాన్ని కోరింది. తాజాగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. తెలంగాణ నుంచి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ సమాచారం ఇచ్చింది.

ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి కేంద్రం మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది. తెలంగాణ ప్రభుత్వం 68.65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించనుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కేంద్రం తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. మొత్తం కలిసి 46 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది.

కాగా, రాష్ట్ర మంత్రులు ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా లెటర్ ఇవ్వాల్సిందే అంటూ కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలోనే ఉంది. వానాకాలంలో పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నోటి మాట కాకుండా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని మంత్రులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ ఇవాళ కేంద్ర పౌర సరఫరాల శాఖ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేస్తాం అని లేఖ రాసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement