ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): అభ్యర్థుల ఖరారే తరువాయి..బీజేపీఎన్నికల ప్రచార శంఖారావానికి శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ కు మద్దతుగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం కుగ్రామం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఆదిలాబాదుకు వచ్చిన కేంద్రమంత్రికి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ఘన స్వాగతం పలికాయి.
అనంతరం ఉండం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలోనే భారత్ శక్తివంతంగా రూపుదిద్దుకుందని.. ఆయన మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మోసపూరిత హామీలతో తిరిగి లోకసభ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. మోడీ పాలనలోనే ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు పటిష్టంగా ఉన్నాయని, గిరిజనుల సంక్షేమం కోసం ఇటీవలే జన్ మన్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
రాంజీ గిండ్, బిర్సా ముండా ఆశయాల కోసం బీజేపీ పాటుపడుతుందని, కాంగ్రెస్ పాలనలో నిమ్న జాతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను ఘనమెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తలమడుగు బిఆర్ఎస్ జడ్పిటిసి తాటి రాజు తో సహా 500 మంది బిజెపి లో చేరారు.
ఎన్నికల ప్రచారానికి సోయం దూరం
కేంద్రమంత్రి తొలిసారిగా అదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు గైర్హాజరయ్యారు. సోయం బాపురావు పాటు మాజీ ఎంపీ బిజెపి నేత రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు ప్రచారానికి దూరంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వీరంతా టికెట్టు కోసం ఆశించి భంగపడ్డ వారు కావడం గమనార్హం.