Saturday, November 23, 2024

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం అభినందన

గ్రామపంచాయతీల పనితీరుపై ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యద్భుత ప్రతిభను కనబరిచిందని కేంద్రం ప్రశంసించింది. కేంద్ర ఆర్థికశాఖ ఇచ్చిన సూచనలతో తెలంగాణ ఆడిట్‌, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేశాయని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి కేఎస్‌ సేథీ కొనియాడారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ఆడిట్‌శాఖ, పంచాయతీ రాజ్‌శాఖలకు లేఖ రాశారు. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌ నిర్వహించాలని రాష్ట్రాలను సేథీ ఆదేశించారు. తెలంగాణ ఆడిట్‌ శాఖ చేపడుతున్న చర్యలను ఇతర రాష్ట్రాలు కూడా పాటించేలా చూస్తామన్నారు. దీంతో గ్రామాల్లో కేంద్ర నిధులు ఏవిధంగా ఖర్చవుతున్నాయో తెలుసుకొనేందుకు వీలవడంతోపాటు అవినీతికి తావుండదన్నారు.

మరోవైపు పంచాయతీల ఆన్‌లైన్‌ ఆడిట్‌లో ఈ ఏడాది కూడా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేలా చూడాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర ఆడిట్‌ విభాగానికి సూచించారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల ఆడిట్‌ను ఆన్‌లైన్‌లో చేసేలా చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌ ఆడిట్‌పై త్వరలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎదుట పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని ఆ లేఖలో తెలంగాణ ఆడిట్‌ శాఖ సంచాలకుడు మార్తినేని వెంకటేశ్వరరావును కోరారు. కరోనా సమయంలోనూ 25 రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్‌ స్థానిక సంస్థలకు రూ.8,923.80 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. గ్రాంట్‌ను 2020-21 ఆడిట్‌ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే ఆన్‌లైన్‌లో ఆడిట్‌ చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌ నివేదికల ఆధారంగానే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement