హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ప్రశాంత పోలింగ్ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణ యాలు తీసుకుంటోంది. ఇప్పటికే కలెక్టర్లు, సీపీలు, ఎస్పీల బదలీలతో ఊపుమీదున్న కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున కేంద్ర భద్రతా బలగాలు తెలంగాణలో మోహరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు, పటిష్ట భద్రతకు సీఈసీ రాష్ట్రానికి 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేటాయించింది. ఈ నెల 20నాటికి ఇవి రాష్ట్రంలోకి రానున్నా యి. వచ్చీ రాగానే వారికి కేటాయించిన జిల్లాలకు చేరుకొని ఎన్నికల విధుల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రంలో 40వేలకు పైగా పోలీసు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అయితే వీరికి తోడుగా అదనంగా తొలి విడతలో కేంద్ర ఎన్నికల సంఘం 100 కంపెనీల బలగాలను తెలంగాణలో మోహరిస్తోంది. ఎన్నికల నాటికి మరో 200 కంపెనీల బల గాలు అవసరపడొచ్చని ఈసీ భావిస్తోంది. దీంతో రాష్ట్ర మంతటా కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలే దర్శనమివ్వను న్నాయి. పోలీసుల ఇనుపబూట్ల చప్పుడుతో తెలంగాణ మార్మోగనుంది.
గతంలో రాష్ట్ర విభజన ఉద్యమంలో సాయుధ బలగాలు పహారా కాసినట్లుగానే ఇప్పుడూ పరిస్థితులు మారిపోనున్నాయి. అయితే రాష్ట్ర పోలీస్ శాఖపై పార్టీలు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలోనే తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. కేంద్ర హోంశాఖకు ఈ నివేదికను చేరవేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా బీజేపీ నేతలు కూడా తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని, ఎన్నికల్లో కేంద్ర బలగాలను వినియోగించాలని అవకాశం వచ్చిన ప్రతిసారి కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. ఈ కోవలోనే కేవలం షెడ్యూల్ వచ్చీరాగానే 100 కంపెనీల బలగాలను తెలంగాణలో మోహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన తీరుతో పార్టీల్లో రసవత్త చర్చ జరుగుతోంది. ఏదేమైనా ప్రతీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం అవసరం మేరకు రాష్ట్రాలలో కేంద్ర బలగాలతో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా ఉంది. అయితే తెలంగాణలో నెలకొన్న తాజా పరిస్థితులు, బీజేపీ పార్టీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటోంది.