Thursday, November 21, 2024

కేంద్రం నిర్లక్ష్యం వలనే గిరిజనులకు అన్యాయం : మంత్రి సత్యవతి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే తెలంగాణలోని గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ అసెంబ్లిdలో బిల్లు పాస్‌ చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఉలుకు పలుకు లేదని ఆమె మండిపడ్డారు. గత ఐదేండ్ల నుంచి అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదని అన్నారు. రిజర్వేషన్లు పెంచకపోవడంతో ఉద్యోగాల్లోనూ, విద్యా సంస్థల ప్రవేశాల్లో గిరిజనులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడారు.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఈ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా కేటాయించిందని ఆమె గుర్తు చేశారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. గిరిజన మహిళలను రాష్ట్రపతిగా చేస్తే స్వాగతిస్తామని, అయితే రాష్ట్రపతి అభ్యర్థి వలన దేశంలో ఉన్న గిరిజనులకు ఏమైనా న్యాయం జరిగిందా? అని ఆమె ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన మహిళను రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపారని ఆమె ఆరోపించారు. పది కోట్ల మంది గిరిజనులు భారతదేశంలో ఉన్నారని , ద్రౌపది ముర్మూ రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకుంటే వారికి న్యాయం జరుగుతుందా అని ఆమె నిలదీశారు. గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ, వారిని మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement