రైతుల పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రం ధాన్యం సేకరణ పై తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఇవాల ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన నిరసన విజయవంతం చేసినందుకు తెలంగాణ రైతులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయని చెప్పారు. తమను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలను రైతులు శిక్షించారని చెప్పారు. మూడు నల్ల చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతున్నదని, రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.