- తుపాన్ తో రాష్ట్రానికి వేల కోట్లు నష్టం
- కేంద్రం మాత్రం రూ.400 కోట్లు ముష్టి విదిల్చింది
- ఇద్దరు కేంద్ర మంత్రులు దద్దమ్మలే
- అందుకే రావాలసిన నిధులు కూడా రావడం లేదు
- కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తల సభలో పొన్నం ప్రభాకర్
కరీంనగర్ – కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వరదలతో నష్టపోతే ముష్టి రూ. 400 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. ఇద్దరు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు దద్దమ్మలని, ఇంత నష్టం జరిగినా ఆ ఇద్దరు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ డీసీసీ కార్యాలయంలో కులగణన, సమగ్ర కుటుంబ సర్వేపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ… కాంగ్రెస్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం కులగణన నిర్వహించబోతున్నామని చెప్పారు. ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో సర్వే చేస్తామన్నారు.. అన్నివర్గాల వారికి న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారబోతుందని చెప్పారు. కుల గణనలో పాల్గొనే ఎన్యుమురేటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళాలని సూచించారు.
బీసీ, ఎస్సీ, మైనారిటీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు వారికి ఇవ్వాలని పొన్నం ఆ పార్టీని కోరారు.. లక్ష రూపాయల రుణమాఫీని ఐదు దఫాల్లో చేసిన వాళ్లు తమ గురించి మాట్లాడితే ఊరుకోవద్దన్నారు పొన్నం. మన పార్టీని తిడితే మన తల్లిని తిట్టినట్లుగా భావించాలని, మనం కూడా ఎదురుదాడి చేయాలని కోరారు.. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు పార్టీలకతీతంగా ఇవ్వబోతున్నామని, ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటనగా మిగిలిపోవాలన్నారు.