తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం టీఎస్‌గా నామకరణం చేస్తూ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ పేరును టీజీగాగా మార్చాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లను టీఎస్ నుండి టీజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం
గత కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ బదులుగా తెలంగాణ గవర్నమెంట్ అని మార్చాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో టీఎస్ అని ఉన్న వాహనాలు, ఇతర సంస్థల పేర్లు టీజీ అని మారుస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఉన్న టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే నెంబర్ ప్లేట్లను ఇలా రిజిస్టర్ చేస్తారని సైతం ప్రచారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగానే రాష్ట్ర రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీ మార్పు చేస్తూ కేంద్ర రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.