Saturday, November 23, 2024

మెట్రో 2 కి కేంద్రం మొండి చేయి – ఇది వివ‌క్ష కాదా అంటూ కెటిఆర్ గ‌రం గ‌రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ముమ్మాటికి కేంద్రం వివక్ష చూపిస్తోంది. తెలంగాణపై సవితి తల్లి ప్రేమను వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మోడీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ప్రతి విషయంలోనూ కిరికిరి పెట్టడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తున్నదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటానూ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. దేశాన్ని సాకుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం సంతోషంగా ఉందని చెప్పారు. మంగళవారం నాడు ఖాజాగూడలోని చెరువుల సుందరీకరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… మూడు న్నర లక్షల కోట్లకు పైగా రూపాయలు రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం మొదలు పెట్టినా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే కేంద్రం మొండి చెయ్యి చూపిస్తున్నదని మండిపడ్డారు. యూపీలో సాధ్యం అయ్యింది.. తెలంగాణలో మాత్రం సాధ్యం కాదనడమే కేంద్ర ప్రభుత్వం
వివక్ష చూపిస్తుందనడానికి నిదర్శనం అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. చిన్న పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు నిధులు కేటాయిస్తున్నదన్నారు. యూపీలోని కాన్పూర్‌, ఆగ్రా, వారణాసి, మీరట్‌, ప్రయాగ్‌రాజ్‌ కంటే తెలంగాణలోని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉందని చెప్పారు. కేంద్రం ముమ్మాటికి సవతి తల్లి ప్రేమను వ్యక్తం చేస్తున్నదన్నారు.

గతంలో మెట్రో రెండో దశ డీపీఆర్‌తో సహా పూర్తి సమాచారాన్ని అందించామని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ పక్షపాతం లేకుండా వ్యవహరించాలని ఆశిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నగరం మెట్రో రైల్‌ విస్తరణ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతలపై కేంద్రం ఆమోద ముద్ర వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండో దశ మెట్రో రైల్‌ సాధ్యం కాదనడంపై లేఖను సైతం రాసిన మంత్రి కేటీఆర్‌.. వివక్ష లేకుండా చూడాలని కోరారు. తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్‌, ఆగ్రా వంటి చిన్న పట్టణాల్లో మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్‌ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి హర్‌ దీప్‌ సింగ్‌ పూరీకి స్వయంగా తానే వివరించేందుకు అనేకసార్లు ప్రయత్నించినా మంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో దశ మెట్రో లైన్‌లో ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటిని నివృత్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

మూడేళ్లలో ఎయిర్‌ పోర్ట్‌ మెట్రోలైన్‌ పూర్తి
వచ్చే మూడేళ్ల లోపే ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో లైన్‌ను పూర్తి చేయనున్నట్లుగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. లక్డీకపూల్‌- బీహెచ్‌ఈఎల్‌, నాగోల్‌ – ఎల్బీనగర్‌ రూట్లలో కేంద్రం సాయం కోరినట్లుగా తెలిపారు. కేంద్రం మొండి చెయ్యి చూపించడం అన్యాయం అంటూ మండిపడ్డారు. భాగ్యనగరంలో మెట్రో లైన్‌ను 250 కిలో మీటర్ల మేర విస్తరించబోతున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ అని.. మున్ముందు ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, విప్‌ అరికెపూడి గాంధీ, మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement