ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించింది. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, ఆమెను నిందితురాలిగా మారుస్తూ సీబీఐ తాజగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కవిత తాను హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. ఇదిలా ఉండగా సీబీఐ నోటీసుల నేపథ్యంతో కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన కవిత… కేసీఆర్ తో ఈ అంశంపై చర్చిస్తున్నారు.
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని లేఖలో కవిత కోరారు. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులకు విరుద్ధంగా ఈ నోటీసులు ఉన్నాయని ఆమె చెప్పారు. సీబీఐకి ఏవైనా సమాధానాలు కావాలంటే… తాను వర్చువల్ పద్ధతితో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… తనకు ప్రచార బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. ఈ కారణంగా తాను ఢిల్లీకి విచారణకు రాలేనని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో, తనకు జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించాలని కోరారు.