ఈ ట్యాపింగ్ సూత్రధారి కేసీఆర్ పై ఇప్పటి వరకూ చర్యలేవి
రేవంత్ కు దమ్ముంటే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి
కాళేశ్వరం లీకేజ్, ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులను
ఎందుకు అటకెక్కించారంటూ రేవంత్ కు ప్రశ్న
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ వీలీనం ఖాయమంటూ జోస్యం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ఇవాళ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు… ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, వెంటనే సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అసలైన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని, దీనంతటికీ కీలక సూత్రధారి మాజీ సీఎం కేసీఆరే అని విచారణలో తేలిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత వరకు కేసీఆర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ధర్నాలో పాల్గొన్న వారిని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయన్నారు. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్… ఇన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం స్కామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్‌పై చర్యలు ఏవన్నారు. పోలీసు అధికారులు, కేసీఆర్ ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిందితుడు వాంగ్మూలంలో చెప్పారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మాఫియా నడిపించారని మండిపడ్డారు.