Friday, November 22, 2024

CBI – ఢిల్లీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. కవితను తిహార్ జైలులోనే విచారించనున్న సిబిఐ

ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు
కోర్టు అనుమతి కోరిన సీబీఐ..
నేడు రౌన్ అవెన్యూ కోర్టులో పిటిష‌న్
షరతులతో అంగీకరించిన న్యాయస్థానం
ఒక రోజు ముందుగా జైలు అధికారులకు సమాచారం
లేడీ కానిస్టేబుల్ సమక్షంలో తిహార్ జైలులోనే క‌విత‌ విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీంతో సీబీఐకి అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో జైల్లోనే ఆమెను విచారించాలని న్యాయస్థానం తెలిపింది. విచారణకు ముందు అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పింది. అలాగే విచారణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని ధర్మాసనం షరతు పెట్టింది.

ఇక విచారణలో కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్‌లో దొరికిన సమాచారం ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారించనుంది. అలాగే భూముల కొనుగోలు వ్యవహారంపై కూడా ప్రశ్నించినుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన వంద కోట్ల వ్యవహారంపై సీబీఐ లోతుగా ప్రశ్నించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తమ కుమారులకు పరీక్షలు జరుగుతున్నందున తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. గురువారం విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను, మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఇద్దరికీ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇద్దరూ తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement