హైదరాబాద్, ఆంధ్రప్రభ : బ్యాంక్ రుణాలను ఎగ వేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన మీనా జువెల్లర్స్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. కంపెనీతో పాటు కంపనీ డైరెక్టర్ ఉమేష్ జేత్వానీపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని కన్సార్టియం నుంచి రూ. 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుంది. మీనా జువెల్లర్స్ డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెజ్, మీనా జువెల్లర్స్ ఎక్సక్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు బ్యాంకుల నుంచి ఈ రుణాలు పొందాయి.
ఈ కంపెనీల ప్రస్తుత ఓనర్లతో పాటు పాత ప్రమోటర్లు కూడా తీసుకున్న రుణాలకు ఖాతాలను చూపలేకపోయారు. 2016 నుంచి 2020 మధ్యకాలంలో మీనా జువెల్లర్స్ అండ్ డైమండ్స్ కంపెనీ రూ. 810 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించింది. అయితే బ్యాంకుల్లో కేవలం రూ. 70 కోట్లు మాత్రమే జమ చేసిందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. మీనా జువెల్లర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా రూ. 884 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించిందని, అయితే బ్యాంకుల్లో కేవలం రూ. 70 కోట్లు మాత్రమే చూపించిందని బ్యాంకర్లు గుర్తించారు. దీంతో సీబీఐ కేసులు నమోదు చేసింది.