ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ధమాషా మేరకు రిజర్వేషన్లు అమలు కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు నిర్దిష్ట ప్రణాళికలు అందజేశామని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. శనివారం యాదాదీశ్వరుని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో గడపడం ఆనందంగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కరరావు స్థానిక ఆర్డీఓ జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆయన దర్శన ఏర్పాట్లలో పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు, అర్చక స్వాములు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆలయం వెలుపల వకుళాభరణం విలేకరులతో కాసేపు మాట్లాడారు. మూడేళ్ల పదవీకాలం ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందన్నారు. మూడేళ్ల పదవీ కాలంలో అంకిత భావంతో పనిచేయగలిగానని, పదవులు నిర్వహించడం తన జీవితంలో కొత్తవి కాదని, ఏ జాతుల హక్కుల కోసం కృషి చేశానో ఆ వర్గాలకు చెందిన బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేయడం తన జీవితంలో మధుర ఘట్టమని ఆయన తెలిపారు.
కుల గణనకు ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చానని చెప్పారు. బలహీనవర్గాలు కులగణన నిర్వహించాలని చిరకాలంగా కోరుతున్నారని, అది ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి శక్తిని ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి మహత్తర ఘట్టంలో కులగణన చేపట్టాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశం రావడం, ఇంటింటి సర్వే నిమిత్తం ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి అందజేసే కార్యాచరణలో భాగం అవడం జీవితంలో గొప్ప సంఘటనగా గుర్తుండి పోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తన పదవి కాలం ఈ రోజుతో ముగుస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అంకితభావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీసీలలోని సంచార విముక్తి జాతుల కులాలు ఇప్పటికీ ఆధునిక అభివృద్ధిని అందుకోలేకపోతున్నారని, కుల సర్వే పూర్తి అయ్యాక వచ్చిన సమగ్ర సమాచారంతో వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదల తీసుకురావాల్సిన బాధ్యతను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల్లో డెడికేటెడ్ కమిషన్ గా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించడానికి విశేషంగా కృషి చేశానని, అయితే గడువు ముగియడం కారణంగా తుది నివేదిక ఇవ్వకుండానే నిష్క్రమించడం కొంత ఇబ్బంది కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కోరుతున్న విధంగా ప్రజా ప్రాతినిధ్యం పెరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తన పదవీ బాధ్యతలను కొనసాగించడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.