హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు రానున్న ఆర్థిక సంవత్సరంలో భూముల వేలం కాసుల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1తో మొదలు కానున్న 2022-23 ఆర్ధిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా హెచ్ఎండీఏ రూ.2 వేల కోట్ల దాకా ఆదాయాన్ని ప్రభుత్వానికి సముపార్జిం చి పెట్టనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ తాను సొంతగా అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ఓపెన్ ప్లాట్లనే కాక హౌజింగ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండే రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్ బండ్లగూడలోని టవర్లలో ఉన్న ఫ్లాట్లను అమ్మేందుకు సిద్ధమయింది. ఈ అమ్మకాలు మొత్తం ఈ వేలం పద్ధతిలో జరగనున్నాయని అధికారులు చెబుతున్నారు.
భూముల వేలం తదితర ఆదాయ వనరుల సంగతి ఎలాఉన్నప్పటికీ హెచ్ఎండీఏకు తన పరిధిలో భవనాలు, లే అవుట్ల అనుమతుల ద్వారా వచ్చే ఆదాయమే కీలకమని అధి కారులు చెబుతున్నారు. అయితే ట్రాన్స్ఫరబుల్ డెవలప్ మంట్ రైట్స్(టీడీఆర్) వల్ల ఇది కొంత వరకు తగ్గినప్పటికీ టౌన్ ప్లానింగ్ ఆదాయంలో జీహెచ్ఎంసీతో పోటీ పడే రోజులు ఎంతో దూరంలో లేవని అధికారులు పేర్కొంటున్నారు.
భారీగా అభివృద్ధి కార్యక్రమాలు…
జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ కూడా హైదరాబాద్ మహానగరంలో రోడ్లు, వంతెనలు వంటి మౌలిక సదుపా యాల అభివృద్ధిలో పోటీపడుతోంది. ఓ పక్క అవుటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్)ను రోజురోజుకు వినూత్నంగా అభివృద్ధి చేస్తూనే మరో పక్క ఎస్సార్డీపీ వంటి వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలోనూ పాలు పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్ఎండీఏ నిర్మాణం పూర్తి చేసి అందు బాటులోకి తీసుకువచ్చిన బాలానగర్ ఫ్లై ఓవర్ అక్కడి ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉందని, ట్రాఫిక్ కష్టాలను భారీ స్థాయిలో తీర్చిందని అధికారులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్‌పై ఉన్న ట్యాంక్‌బండ్‌ను సుందరంగా తీర్చిదిద్దడంలోనూ హెచ్ఎండీఏ విజయవంతమైందని పేర్కొంటున్నారు.
తాజా బడ్జెట్లో హెచ్ఎండీఏ కేటాయింపులు అతి స్వల్పం…
సొంత వనరుల సముపార్జనలో దూసుకుపోతుండడమే కాక భూముల వేలంతో వచ్చే ఫీజుల ఆదాయం పెద్ద ఎత్తున రానుండడంతో హెచ్ఎండీఏకు ప్రభుత్వం బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు చేయలేదని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు మాత్రమే హెచ్ఎండీఏకు ఇచ్చింది. దీంతో హెచ్ఎండీఏకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు చేయాల్సిన అవసరం లేదన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..