Saturday, November 23, 2024

కరోనా వ్యాక్సినేషన్‌కు బ్రేక్‌

  • 4 రోజులు నో టీకా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్‌కు నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించింది. గురువారం నుంచి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉండదు. ఈనెల 14 నుంచి 17 వరకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపివస్తే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరిగి సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌, వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జి డా. జి. శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. దసరా పండగ నేపథ్యంలో నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌కు వైద్య, సిబ్బంది విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బంది విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌.. వ్యాక్సినేషన్‌కు విరామం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను ఆదేశించారు. దీంతో గురువారం నుంచి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్‌లో ఉన్న వైద్య సిబ్బందికి సెలవు ప్రకటిస్తూ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వరకు కరోనా వ్యాక్సిన్‌ కోసం కేంద్రాలకు వెళ్లొద్దని ప్రజలకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచించారు.ఈ ఏడాది జనవరి 16 నుంచి తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి వైద్య సిబ్బంది నిర్విరామంగా కరోనా టీకా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. అయితే 8 నెలలుగా నిర్విరామంగా టీకా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి దసరా సందర్భంగా విరామం ఇవ్వాలని రాష్ట్ర వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జి, డీహెచ్‌ డా. జి. శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement