Tuesday, November 19, 2024

TS : అవి బయటపెడితే తట్టుకోలేరు… క‌డియం వార్నింగ్‌….

బీఆర్‌ఎస్‌ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని అవి బయటపెడితే తట్టుకోలేరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వార్నింగ్‌ ఇచ్చారు. మంగళవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను వీడటం కొంత బాధగానే ఉందని, కేసీఆర్‌పై నాకు గౌరవం ఉందని, ప్రత్యేకంగా కేసీఆర్‌పై నేను ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదన్నారు.

- Advertisement -

పల్లా రాజేశ్వర్‌రెడ్డి కారణంగానే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ చెవిలో దూరి తప్పుడు సమాచారం ఇస్తూ, ఇతరులపై లేనిపోని చాడీలు చెప్పి నేతలను కేసీఆర్ కు దూరం చేశారని కడియం శ్రీహరి అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వల్లనే పార్టీ ఓడిపోయిందని కూడా అన్నారు. ఇదే అభిప్రాయం తనలో మాత్రమే కాదని అనేక మంది నేతల్లో ఉందని, కావాలంటే ఎవరైనా ఆయన వ్యవహారశైలిపై అంతర్గతంగా నేతలను విచారించవచ్చని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని అన్నారు.

ఎర్ర‌బెల్లి నోరు అదుపులో పెట్టుకో..

మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఓటమి పాలయిన ఎర్రబెల్లి దయాకర్ రావు తనను విమర్శించే స్థాయిలేదన్నారు. తన నిజాయితీ అందరికీ తెలుసునని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఎందరో పార్టీలు మారినా తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల అందరి చరిత్ర తన వద్ద ఉందని, తనకు ఒక్క రూపాయి బీఆర్ఎస్ ఇచ్చినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్‌కే ఉంది…

బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు కడియం శ్రీహరి. బీజేపీ.. సీబీఐ, ఈడీలను ప్రయోగించి నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంద‌న్నారు. బీజేపీలో చేరితే పునీతులవుతార‌ని, కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్లలో గెలిస్తే వారు రాజ్యాంగాన్నే మార్చేస్తార‌ని, రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాదం ఉందని క‌డియం పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అప్రజాస్వామిక పద్దతులను అడ్డుకోవాల్సి అవసరముందని బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఎన్నికల్లో నన్ను గెలిపించిన విధంగానే, కావ్యను కూడా గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement