పాపన్నపేట, (ప్రభన్యూస్): మధ్యతరగతి కుటుంబంల్లోని పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. కరోనాకు ముందున్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం అన్నింటి రేట్లు పెరిగాయి. దీంతో సామాన్యులు సైతం అవస్థలు పడుతున్నారు. పిల్లల చదువులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు ఇలా అన్నింటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న వేళ.. స్కూల్ స్టేషనరీ రేట్లు పెరగడం మరింత భారంగా మారింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఆధారం. పంటల సాగులో జూన్ నెల అత్యంత కీలకం. ఈ సమయంలో వానాకాలం పంటల సాగుకు పెట్టుబడులు అవసరం. ఇదే సమయంలో విద్యా సంవత్సరం ప్రారంభం కావడం పెను భారమవుతోంది. ఇటు ఫీజులు, పుస్తకాలు అంటూ పిల్లలు గోళ చేయడం, అటు పంటలు వేసేందుకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాల్సి రావడంతో డబ్బులు అందక సతమతమవుతున్నారు. తరగతుల వారీగా పాఠ్యపుస్తకాల ధరలు పెరిగిపోయాయి. ఇంత మొత్తం చెల్లించి కొనుగోలు చేద్దామన్నా మార్కెట్‌లోకి పుస్తకాలు రాలేదు. పాఠ్యపుస్తకాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో మార్కెట్లో స్కూళ్ల ప్రారంభం సందడి కనిపించడం లేదు.
ఫీజులు రెట్టింపు..
కరోనా ప్రభావంతో రెండేళ్లుగా ప్రైవేటు పాఠశాలలు సక్రమంగా కొనసాగలేదు. దీంతో ఈ సారి ఫీజులు అమాంతం పెంచేశారు. రెండేళ్ల ఆర్థిక నష్టాలను ఈ ఏడాది పూడ్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కార్పోరేట్ పేరు చెప్పుకొని కొనసాగుతున్న కొన్ని ప్రైవేటు స్కూళ్లు నర్సరీ ఫీజును రూ.10 వేలు, ఎల్‌కేజీ, యూకేజీకి రూ.12 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. తరగతులు పెరిగిన కొద్దీ గతేడాదితో పోలిస్తే.. ఈ సారి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పెంచారు. చిన్న ప్రైవేటు పాఠశాలలు కూడా వారి స్థాయిని బట్టి ఫీజులు పెంచాయి. ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రైవేటు యాజమాన్యాలు ముందస్తుగానే ఫీజులు వసూళ్లు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ పది రోజుల్లో ఎలాగైన 50 శాతం ఫీజులు వసూలు చేసే దిశగా సాగుతున్నాయి. స్కూల్ ఫీజు చెల్లించాలని కోరుతూ తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. ఫీజు మొత్తం ఒకే సారి చెల్లిస్తే కొంత మొత్తం తగ్గిస్తామని ఆఫర్లు ఇస్తున్నాయి. ఒకేసారి 50 శాతం ఫీజులు అడుగుతుండటంతో తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు.
తరగతులు వారీగా టెక్ట్స్ బుక్స్ ఖర్చులు..
కరోనాకు ముందు 2020లో 150 పేజెస్ నోట్‌బుక్ రూ.20లు ఉంటే ఇప్పుడు రూ.25, 200 పేజెస్ నోట్‌బుక్ రూ.30లు ఉంటే ఇప్పుడు రూ.40 వరకు ఉంది. స్కూల్ బ్యాగ్ రూ.150 ఉంటే ఇప్పుడు రూ.190 నుంచి రూ.300లకు పైగా పెంచేశారు. 5వ తరగతికి రూ.500 ఉంటే ఇప్పుడు రూ.600లు, 6వ తరగతికి రూ.363 ఉంటే ఇప్పుడు రూ.590, 7వ తరగతికి రూ.420 ఉంటే ఇప్పుడు రూ.650, 8వ తరగతికి రూ.520 ఉంటే ఇప్పుడు రూ.780, 9వ తరగతికి రూ.550 ఉంటే ఇప్పుడు రూ.900, 10వ తరగతికి రూ.650 ఉంటే ఇప్పడు రూ.1,000లకు పైగా పెంచేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.