హైదరాబాద్, ఆంధ్రప్రభ : రవాణా విభాగంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎఎంవీఐ) నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన మేరకు 80039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నియామకాల్లో భాగంగా పలు శాఖల వారీగా నియామక సంస్థలు నోటీఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే 503 గ్రూప్ 1 ఉద్యోగాలతోపాటు 17వేలకు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా జూన్ 27న 113 ఎఎంవీఐ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్ ప్ర క్రియ పూర్తికాకముందే సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
ఆ తర్వాత ఈ నోటిఫికేషన్‌పై ఎటువంటి అదనపు సమాచారం వెల్లడించలేదు. కాగా ఈ నోటిఫికేషన్‌లో అర్హతలపై మహిళా అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ప్రధానంగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా అభ్యర్థులకు ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అడగకుండా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడగడం ఏంటి..? అని మహిళా అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు. మహిళా అభ్యర్థులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అసాధ్యమని పేర్కొనడంతో అప్లికేషన్ల ప్రక్రియను నిలిపివేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయాన్ని ప్రకటించింది.