కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా గులాబీ దళపతి, ఉద్యమ నేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఎల్లుండి నుంచి జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అంతా సిద్ధం చేసుకున్నారు. తొలుత చేవెళ్ల లోక్‌సభ నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇక వరుస సభలు, బస్సు యాత్రలు, రోడ్‌షోలతో కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్ భేటీ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను, కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. పార్టీ కేడర్ని అసెంబ్లీ ఓటమి నుంచి బయటపడేసి, మళ్లీ పునరుత్తేజం కల్పించేలా పర్యటనలు సాగుతున్నాయి.
ఎల్లుండి నుంచి జనంలోకి ఉద్యమ నేత
కేసీఆర్ వరుస బహిరంగ సభలకు ప్లాన్
ఇక హెరెత్తనున్న బీఆర్ఎస్ ప్రచారం
వ్యూహం సిద్దం చేసుకున్న అభ్యర్థులు
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను ఎండగట్టడమే లక్ష్యం
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కేటీఆర్, హరీశ్ భేటీ
కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసిన నేతలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : భారత రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యింది. అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి. ఇక.. 13వ తేదీన చేవెళ్ల బహిరంగసభ నుంచి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పదేళ్ల తమ హయాంలో చేసిన పనులను వివరిస్తూ గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లనుంది.
లోక్ సభ ఎన్నికల వాతావారణం తెలంగాణలో రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇప్పటికే పార్టీలు సమావేశాల రూపంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు అత్యంత సవాల్‌గా మారాయి. అసెంబ్లీ ఓటమి నుంచి తేరుకోకముందే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల వలసలు ఇక్కట్లను తెచ్చిపెట్టాయి. 16 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా, వరంగల్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కడియం కావ్య అనుభవం నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ప్రకటించేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చని అంటున్నారు.
నియోజకవర్గాల వారీగా కేటీఆర్, హరీశ్ భేటీ
ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేసి ఆ తదుపరి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మెజార్టీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మండల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గాల వారీ సమావేశాలకు హాజరవుతున్నారు. నేతలు, శ్రేణులకు లోక్ సభ ఎన్నికలపై దిశానిర్ధేశం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలే ప్రధాన అస్త్రం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఎండిన పంటల పరిశీలన సందర్భంగా సూర్యాపేట, సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది.
ఎల్లుండే చేవెళ్ల సభ
13వ తేదీన చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 15వ తేదీన మెదక్‌లోనూ కేసీఆర్ సభ జరగనుంది. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సుయాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.