తెలంగాణలో శరవేగంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. జాతీయ నేతలను రంగంలోకి దింపుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకోవడంతో మరోసారి అగ్రనేతలను రంగంలోకి దించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 22న రాష్ట్రానికి రానున్నారు. అలంపూర్, నల్గొండ ఎన్నికల సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈనెల 28వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ ప్రధాన సమన్వయకర్త విజయశాంతి తెలిపారు. కేసీఆర్ చెబుతున్న అవాస్తవాలను తిప్పికొట్టేందుకు ప్రచార కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలికేందుకు తాము అహర్నిషలు కృషి చేస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.