Friday, November 8, 2024

TG | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చినట్లుగానే కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించారు. ఉద్యోగులు, ఆయా సంఘాల నేతలు, జేఏసీ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఈ సబ్‌ కమిటీ కృషి చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ మేరకు శుక్రవారం సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీకి డిప్యుటీ సీఎం భట్టి నేతృత్వం వహించనుండగా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రత్యేక అతిథిగా ఉన్నారు.

కమిటీలో ప్రభుత్వ కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా కొనసాగనున్నారు. ఈ కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రభుత్వ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను అధ్యయనం చేయనుంది. ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించనుంది.

కమిటీ నిర్వహించే సమావేశాలకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు, సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరవనున్నారు. ఈ ఉప సంఘం ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులతో సమావేశమై.. వారితో చర్చలు జరిపి నివేదిక ఇచ్చాక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement