Saturday, November 23, 2024

Big story : వ‌డ్లు కొంటాండ్లు, పైస‌లిస్త‌లేరు.. కొనుగోలు కేంద్రాల వద్ద స్లోగా ఎంట్రీలు

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే విధంగా తయారైంది ధాన్యం కొనుగోలు పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది…కానీ పలుకారణాలతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు…పౌరసరఫరాల శాఖ వద్ద డబ్బులు మూలుగుతున్నా రైతుల ఖాతాల్లో మాత్రం సకాలంలో డబ్బులు జమ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్పిస్తే రైతులకు మేలు చేయాలనే ఆలోచన రావడం లేదు…కొనుగోలు కేంద్రాల వద్ద ఎంట్రీలు చేయకపోవడం…రైతులకు సంబంధించి ఓటీపీలు రాకపోవడం…ఆధార్‌తో భూముల వివరాలు అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులుజమ కావడం లేదు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ. 29.90కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా కేవలం రూ. 3.05కోట్లు మాత్రమే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. డబ్బుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి..

యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయమై నువ్వు నేనా అనే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న పంచాయతీతో ఆశించినమేర వరి సాగు కాలేదు. జిల్లాలో కేవలం 48వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. వరి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం అధికారులుు ఊరూరు తిరిగి వరి సాగు వద్దని రైతుులకుు అవగాహన కల్పించిన నేథ్యంలో సాగు తగ్గింది. జిల్లా వ్యాప్తంగా కేవలం 48వేల ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే వరి సాగయ్యింది. జిల్లాలో యాసంగిలో 45వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో భాగంగానే 42కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మొయినాబాద్‌, నందిగామ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పటివరకు 3532మంది రైతుల వద్దనుండి 15,258మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

చెల్లించాల్సింది రూ. 29.90కోట్లు…చెల్లించింది రూ. 3.05కోట్లే…

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీజిల్లాలో మాత్రం రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి మాదిరిగా తయారైంది. మూడు ప్రధాన కారణాలతో రైతులకు సకాలంలో డబ్బులు అందడం లేదు. జిల్లాలో 3532మంది రైతుల వద్ద నుండి రూ. 15,258మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు రైతులకు రూ. 29.90కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ. 3.05కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. 3532మంది రైతులకు గాను కేవలం 405మంది రైతుల మాత్రమే ధాన్యం డబ్బులు అందాయి. మిగతా రైతులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం సాగుకు పెట్టుబడులు అవసరం. సకాలంలో డబ్బులు వస్తే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు వినియోగిస్తారు. కానీ రోజులు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం మినహా సమస్యను గుర్తించి సకాలంలో పరిష్కరించలేకపోతున్నారు. సమస్య ఎక్కడుందని గుర్తించి పరిష్కరించాల్సిన అధికారులు ఎవరికి వారే యమునాతీరే అనే
విధంగా వ్యవహరిస్తున్నారు.

మూడు ప్రధాన సమస్యలు….

- Advertisement -

రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ కాకపోవటానికి కారణం మూడు ప్రధాన సమస్యలున్నాయి. వీటిని గుర్తించినా సకాలంలో సమస్యను పరిష్కరించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల వద్దనుండి ధాన్యం కొనుగోలు చేయగానే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తరువాత పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద సక్రమంగా ఎంట్రీలు జరగడం లేదు. మొక్కు బడిగా ఎంట్రీలు చేస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. దాంతోపాటు రైతులకు ఓటీపీలు సక్రమంగా రావడం లేదు. ఇది కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఓటీపీ వస్తేనే సంబంధిత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు వీలుంటుంది. రైతుల ఆధార్‌ నంబర్‌ ఎంట్రీ చేయగానే రైతులకు సంబంధించిన భూముల వివరాలు వస్తాయి. కానీ చాలామంది రైతులకు సంబంధించి ఆధార్‌ ఎంట్రీ చేసిన తరువాత వారి భూముుల వివరాలు రావడం లేదు. రైతుకు సంబంధించి ఎంత భూమి ఉందనే విషయమై స్పష్టత లేకపోవడంతో సకాలంలో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో డబ్బులు జమ చేయలేకపోతున్నారు.

పౌరసరఫరాల శాఖ వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి దండిగా డబ్బులున్నాయి. కానీ మూడు ప్రధాన కారణాలతో వాళ్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. ఎవరికి వారే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పిస్తే సమస్యను పరిష్కరించి రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు అందేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ధాన్యం అమ్మినాము డబ్బులు వస్తాయనే ధీమాతో రైతులు ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు…

నెలాఖరు వరకు కోతలు….

రంగారెడ్డి జిల్లాలో యాసంగిలో వరి నాట్లు ఆలస్యమైయ్యాయి. దీంతో కోతల మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు కేవలం సగం వరకు మాత్రమే వరి కోతలు కోశారు. మిగతా రైతులు నెలాఖరు వరకు కోతలు కోసే అవకాశం ఉంది. యాసంగిలో 45వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 15,258మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నెలాఖరు వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఐనా టార్గెట్‌ మేర ధాన్యం సేకరించే అవకాశాలు కనిపించడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement