టికెట్ కౌంటర్‌లో నగదు దొంగతనం
దత్తాత్రేయ ఆలయంలో హుండీ పగులుగొట్టి నగదు అపహరణ
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు
క్లూస్ టీమ్.. డాగ్ స్కేడ్‌తో పరిశీలన
సెక్యూరిటీ గార్డుల విధుల ఆరా
ఆంధ్రప్రభ స్మార్ట్, బాసర : బాసరలో కొలువైన సరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. అయితే ఎంతమేరకు చోరీ జరిగిందో అంచనాలు వేస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బైంసా ఏఎస్ పి అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేశ్, ఆలయ ఈవో విజయరామారావు పరిశీలించారు.
చోరీ జరిగిన స్థలాలు..
అమ్మవారి ఆలయంలో ప్రసాదం టికెట్ కౌంటర్‌లోకి దొంగలు చొరబడి నగదును అపహరించుకుపోయారు. బాసర ఉప ఆలయం గోశాల ఇనుప కంచెను తొలగించి గోపురంపై నుండి ఆలయంలోకి ప్రవేశించారు. ఉప ఆలయం దత్తాత్రేయ ఆలయం ముందర ఉన్న హుండీని పగులగొట్టారు. అందులో ఉన్న నగదు, అలాగే భక్తులు మొక్కులు చెల్లించిన బంగారం, వెండి చిన్న ఆభరణాలు దొంగలించారు. మహంకాళి ఆలయం ముందర ఉన్న కౌంటర్ ను తెరిచి వస్తువులను చిందర వందర చేశాడు.
సెక్యూరిటీ గార్డుల విధులపై ఆరా..
అమ్మవారి ఆలయంలో సుమారు గంటకు పైగా చోరీదారులు ఉన్నా సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారన్నది ప్రతి ఒక్కరి ప్రశ్న. సెక్యూరిటీ గార్డుల విధులపై అటు పోలీసులు, ఇటు ఆలయ అధికారులు ఆరా తీస్తున్నారు.
క్లూస్ టీమ్… డాగ్ స్క్వాడ్.. పరిశీలన..
చోరీ జరిగిన ఆలయానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫింగర్ ప్రింట్‌లు సేకరిస్తున్నారు.