Saturday, November 23, 2024

అదానీ, అంబానీలకు మేలు చేసేలా బడ్జెట్.. అసమర్థతను ప్రశ్నించినందుకు దీక్షలా: టీఆర్‌ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ‌ రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాలపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు చిత్తశుద్ది లేదని టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు మండిపడ్డారు. గురువారం న్యూఢిల్లీలోని తెలంగాణ‌ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన బీజేపీ.. ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పాల్సిందిపోయి దీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తాలని ఎంపీలు సూచించారు.

ప్రాజెక్టులు, నిధుల కోసం పోరాడండి : వెంకటేష్
దేశ ప్రజల హితం, రాష్ట్రాల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు సిగ్గు, లజ్జ లేకుండా దీక్ష చేస్తున్నారని విమర్శించారు. దొంగే దొంగ దీక్షకు కూర్చున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. 2002లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజ్యాంగాన్ని మార్చాలని పార్లమెంట్‌లో ప్రస్తావించడం నిజం కాదా? జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వేయడం, నివేదిక ఇవ్వడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అందించిన రాజ్యంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మేధావులు భావిస్తున్నారని వెంకటేష్ చెప్పుకొచ్చారు. కాషాయ పార్టీ మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని చూస్తోందని, రాష్ట్రాల హక్కులు, అధికారాలను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీ నాయకులను సీబీఐ, ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఎంపీ వెంకటేష్ నేత వెల్లడించారు.

అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఇదేనా? జై భీం దీక్షలను చేస్తున్నది ఇందుకేనా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే దీక్షలు చేయడం కాదు, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడండని ఆయన హితువు పలికారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు, నిధులపై దీక్ష చేయండి, నదీ జలాల ట్రిబ్యునల్స్ ఏర్పాటుపై దీక్ష చేయండి, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఆర్థిక సంఘం నిధుల కోసం దీక్ష చేయండి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం జాతీయ హోదాపై దీక్ష చేయండని వెంకటేష్ నేత సూచించారు. మీ అసమర్ధతను ప్రశ్నించినందుకా ఈ దీక్షలని ప్రశ్నించారు. వేలం వేస్తున్న బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినా పట్టించుకోలేదు గానీ గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అడగ్గానే రెండు కోల్ బ్లాక్‌లను కేటాయించారని గుర్తు చేశారు. తెలంగాణాపై ఎందుకీ వివక్ష అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ చేతికి చిక్కి ఏడుస్తున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందన్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలనా దక్షకుడిగా దేశానికి దిక్సుచిగా నిలిపారని ఎంపీ వెంకటేష్ నేత హర్షం వ్యక్తం చేశారు.

రాజకీయాలు చేస్తే మీకే నష్టం : కవిత
టీఆర్‌ఎస్‌కు 95-105 నుంచి సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్పగానే బీజేపీ నేతలకు వణుకు పుట్టిందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాజ్యాంగం ఇంకా మంచిగా ఉండాలని కేసీఆర్ అంటే బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని ఆమె చెప్పుకొచ్చారు. అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్ని మార్చుకోవాలని అంబేద్కర్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అంబానీ, అదానీలకు మేలు చేసేలా ఉన్న బడ్జెట్‌లో తెలంగాణాకు జరుగుతున్న నష్టంపై దీక్ష చేయాలని కవిత సూచించారు. అనవసర రాద్దాంతం చేస్తూ రాజకీయాలు చేస్తే మీకే నష్టమని హెచ్చరించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు బీజేపీ ప్రభుత్వం ఏం వెలగబెట్టిందని ఆమె ప్రశ్నించారు. బండి సంజయ్ తిన్నది అరగక పాదయాత్రలు చేస్తున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు.

తెలంగాణా గాంధీ సీఆర్ : శ్రీనివాసరెడ్డి
కేసీఆర్ చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశమంతా గమనిస్తోందని ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీ, అంబేద్కర్‌గా మారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏ కులాలు, ఏ వర్గాల వారిలో వెతికినా కేసీఆర్ చిరస్మరణీయంగా ఉంటారని ఎంపీ తెలిపారు.

- Advertisement -

రాజ్యాంగాన్ని స‌వ‌రించాలి, కొత్త అంశాలు చేర్చాలి : పసునూరి దయాకర్
రాజ్యాంగంలో కొన్ని కొత్త అంశాలను చేర్చాలని కేసీఆర్ చెప్పారని, రాజ్యాంగంలోని అంశాలను అమలు చేస్తే రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయమని ఎంపీ పసునూరి దయాకర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను దళితులకు ఆపాదించి అంబేద్కర్‌ను విమర్శించాడని రాజకీయాలు చేస్తున్నారన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ, ఇతర అంశాలను మర్చిపోయి కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. వంద అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని దయాకర్ జోస్యం చెప్పారు.

బీసీ జనగణన చేయండి : లింగయ్య యాదవ్
బీసీలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎంపీ బడుగుల లింగయ్య ఆరోపించారు. బీసీనని చెప్పుకునే ప్రధాని పాలనలో కేంద్రంలో బీసీ శాఖ కూడా లేదని ఎద్దేవా చేశారు. బీసీల లెక్కలపై తెలంగాణా సహా అనేక రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలు చేశాయని వివరించారు. బీసీల జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నానని లింగయ్య యాదవ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement