Friday, October 18, 2024

Budget – తెలుగు కోడ‌లు తెలంగాణ‌కు అన్యాయం చేసింది.. కెటిఆర్ , హరీశ్ ల ధ్వజం


ఈ బడ్జెట్ లో తెలంగాణ‌కు గుండు సున్నా
క‌నీసం తెలంగాణ ప‌దం కూడా ప‌ల‌క‌లేదు
తెలంగాణ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు
కేంద్రంపై కెటిఆర్, హారీశ్ ల ధ్వ‌జం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామ‌ని, అయితే కానీ దక్కింది శూన్యం అని వ్యాఖ్యానించారు బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ . కేంద్రం రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని., బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశార‌ని, అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామ‌ని గుర్తు చేశారు.. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని., రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదని ఆయన వాపోయారు.

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల‌న్నారు. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంద‌ని చెప్పారు కెటిఆర్., ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన తెలియజేస్తోందని అన్నారు. పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేని ద్వ‌జ‌మెత్తారు.

- Advertisement -

తెలంగాణ పేరే ప‌ల‌క‌ని నిర్మలా సీతారామ‌న్

కేంద్రబడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అంటూ ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేద‌ని అంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నలు గుప్పించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదీ ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు.. తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అంటూ హరీశ్‌ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement