Friday, November 22, 2024

BSP – నేను పేదల బిడ్డను ఆదరించండి… సిర్పూర్ ఓటర్లకు ప్రవీణ్ కుమార్ వినతి

కాగజ్ నగర్,ఆసిఫాబాద్. – సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులను, పరిశ్రమల మంత్రి కెటిఆర్, ,కోనప్ప, ,జెకె కంపెనీ యాజమాన్యం రహస్య ఒప్పందం కుదుర్చుకుని దోచుకుంటున్నారని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు సిర్పూర్ పేపర్ మిల్ కంపెనీ కార్మికులతో మైనారిటీ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు నెల జీతం అధికంగా ఇస్తూ,స్థానికులకు తక్కువ జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. కనీసం మిల్లులో కార్మికులకు క్యాంటిన్ కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.

కార్మికుల మధ్య ఐక్యత లేకుండా చేయడం కోసం యూనియన్ ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో 35 వేల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి మోసం చేశారని గుర్తు చేశారు.
ఒకప్పుడు స్థానిక కార్మికుల సంఖ్య 4 వేలు ఉండగా ఇపుడు 800 మందికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు

.కలుషిత నీరు,గాలి పీల్చేది స్థానికులైతే లాభాలు మాత్రం స్థానికేతరులకా అంటూ నిలదీశారు. జిల్లా కలెక్టర్లు,ఎస్పి,అధికారులను మార్చడానికి కెటిఆర్ కలిసే కోనప్ప,కార్మికుల సమస్యల గురించి ఎందుకు కలవరని ధ్వజమెత్తారు.
కార్మికుల సమస్యల గురించి మంత్రి మల్లారెడ్డి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.అతనికి వందల కోట్ల కుంభకోణాలు తప్ప కార్మికుల బాధలు పట్టవన్నారు. 5 అగ్రిమెంట్లు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయన్నారు.
ప్రభుత్వం సిర్పూర్ మిల్లుకు 13 రకాల రాయితీలు ఇచ్చినా,మార్కెట్ రాయితీలు కల్పిస్తున్నా, యాజమాన్యం మాత్రం కార్మికులను ఆదుకోవడం లేదన్నారు.కనీసం కార్మికుల పిల్లలకు రెండు నోట్ బుక్స్ ఇవ్వడం లేదని వాపోయారు.
కార్మికులకు ప్రమాద భీమా 30 లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్య వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు.నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలన్నారు.క్వార్టర్స్ ఇచ్చి నివాసం కల్పించాలన్నారు.అడ్వాన్స్ 50 వేలు ఇవ్వాలన్నారు.

సిర్పూర్ ప్రజలకు దళితబంధు ఇస్తామని ఆశ చూపుతున్నారని,దమ్ముంటే ప్రభుత్వం దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. .గిరిజనులకు గిరిజన బంధు,బిసిలకు బిసి బంధు,మైనారిటీలకు కూడా బంధు పథకం పెట్టాలని డిమాండ్ చేశారు.
తాను పేద కుటుంబంలో పుట్టానని,పేదల బాధలు,కార్మికుల బాధలు తెలిసిన బిడ్డగా మీ సమస్యలు తీర్చడానికే సిర్పూర్ కు వచ్చానన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ పాలనలోనే పేదలకు కార్మికులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానికులకు న్యాయం జరగాలన్నా,దోపిడీ ఆంధ్రుల పాలన పోవాలన్నా ఏనుగు గుర్తుకు ఓటేసి బిఎస్పిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సీడం గణపతి,నియోజకవర్గ నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement