ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 80,397.17, నిఫ్టీ 24,433.20 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ ఉదయం 80,107.21 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,960.38) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. చివరికి 391.26 పాయింట్ల లాభంతో 80,351.64 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 112.65 పాయింట్ల లాభంతో 24,433.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.49గా ఉంది.
సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, సన్‌ఫార్మా, టైటాన్ షేర్లు రాణించాయి. రిలయన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ రకం బ్యారెల్ చమురు ధర 85.47, బంగారం ఔన్సు ధర 2370 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.