రామగిరి, జనవరి 13 (ప్రభన్యూస్): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిందని, గత ప్రభుత్వం విధానాల వల్ల ఆర్థికంగా రాష్ట్రం చితికి పోయిందని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విమర్శించారు. మండలంలోని కల్వచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయితీ భవనాన్ని, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు తెలంగాణ రాష్ట్రంను అప్పుల ఊబిలోకి దించారని, నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుతో పరిస్థితిని అంచనా వేస్తూ.. ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు సాగుతున్నామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను సబ్బండ వర్గాలను దృష్టిలో ఉంచుకొని రూప కల్పన చేసినవేనన్నారు. ఇందులో మహిళలకు పెద్ద పీట వేశామని, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
అలాగే 5లక్షల నుండి పది లక్షలకు ఆరోగ్య శ్రీని పెంచామన్నారు. దశల వారీగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, ఉచితంగా 200 యూనిట్‌ల విద్యుత్, నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. కల్వచర్ల నుండి లోంకకేసారం గ్రామం వరకు సిసి రోడ్డు వేసేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో తీసుకున్న అర్జీలను పరిశీలించి నిజమైన నిరుపేదలకు న్యాయం చేస్తామన్నారు.
ప్రభుత్వ ఫలాలను పొందేందుకు ఎవరికి పైసా లంచం ఇవ్వరాదని ప్రజలను కోరారు. ప్రజలకు మేలు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, మాది ముమ్మాటికీ ప్రజా ప్రభుత్వమేనన్నారు. విద్య, వైద్యం, ఇండ్లు తదితర హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.