Friday, November 22, 2024

BRS – ఆప‌రేష‌న్ గులాబీ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భారాస అధినేత గెలుపు వ్యూహాలను అమలు చేయబోతున్నారా..? కాంగ్రెస్‌ ఎత్తులను చిత్తు చేస్తూ మునుగోడు తరహా పార్టీ చేరికలు కొనసాగనున్నాయా..? సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించారా..? అంటే ఇప్పుడు ఆ పార్టీ వర్గాలు అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి. దశాబ్ది ఉత్స వాలు ముగియడంతో అదే ఉత్సాహం కొనసాగించేలా పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. సీట్ల సర్దుబాటుపై సీరియస్‌గా వడపోతకు ప్రయత్నిస్తున్నారు. సర్వేల ఆధారంగా గెలుపు ఓటముల లెక్కలు బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చుతారన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

నల్గొండ, ఖమ్మం నేతలే టార్గెట్‌
ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు గులాబీ అధిష్టానంతో టచ్‌లోకి వచ్చినట్లుగా సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చర్చలు సాగుతున్నాయి. ప్రధానంగా బలమైన నేతలను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి కూడా వలసలు కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. కొంత మంది అసంతృప్తి నేతలు అధిష్టానంతో టచ్‌లోకి వచ్చినట్లుగా గులాబీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌, బీజేపీలోని కీలకమైన నేతలే లక్ష్యంగా భారాస ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోని ఇతర పార్టీల్లోని లీడర్ల పైనే దృష్టి సారించింది.

కమ్యూనిస్టులతో కలిసి..
మారుతున్న రాజకీయ పరిస్థితులతో బీఆర్‌ఎస్‌ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి వెళ్లాలని డిసైడ్‌ అయినట్లుగా తెలుస్తోంది. దక్షిణ తెలంగాణను క్లీన్‌ స్వీప్‌ చేయాలంటే సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పోటీ చేయాలన్న భావనలో ఉంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలకు తక్కువలో తక్కువగా 5 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది. కొన్ని స్థానాల్లో అది కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధినేత అంచనా వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు భారాసతో పొత్తు ఉంటుందని పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వస్తున్నారు. భారాస నేతలు సైతం కలిసి వెళ్తేనే తమకు మెజార్టీ పెరుగుతుందన్న భావనలో ఉన్నారు. ఇరు పార్టీలకు ఒక్కో స్థానం లేదా రెండు స్థానాలు ఇచ్చే ప్రతిపాదన త్వరలో ఆ పార్టీల ముందు ఉంచనున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement